నిమ్మగడ్డ ఎన్నికల తంత్రానికి వైసీపీ విరుగుడు మంత్రం

-

లోకం మొత్తం కరోనాతో భయపడుతుంటే.. ఏపీలో లోకల్‌వార్‌ మాత్రం ఈ వైరస్‌ చుట్టూ తిరుగుతోంది. కరోనా కేసుల సంఖ్యతో కుస్తీ పట్టడం… ఈ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో ఎన్నికలను నిర్వహిస్తామంటున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. సెకండ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది. ఎస్ఈసీ ఎన్నికల లెక్కలకు ఎప్పటికప్పుడు విరుగుడు మంత్రం వేస్తుంది అధికార వైసీపీ.

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. కేసుల సంఖ్య కూడా నెమ్మదిస్తోంది. గతంలో రోజుకూ పదివేల వరకు నమోదైన సందర్భాల నుంచి 1500 నుంచి వేయి వరకు కేసులు తగ్గిన పరిస్థితి. అప్పట్లో కరోనా వైరస్‌ వ్యాప్తి అంశాన్ని ఆధారంగా చేసుకుని స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో ఆయన ఎన్నికలను నిర్వహిస్తామంటున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ వైద్యారోగ్య శాఖ విడుదల చేసే కరోనా గణాంకాలను ఎస్ఈసీ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయట.

ఇదే అంశంపై అధికార పార్టీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. రోజువారీ కరోనా కేసులను ఎస్ఈసీ నిమ్మగడ్డ పరిశీలిస్తున్నట్టుగా మరెవరు సమీక్షించడం లేదని అనుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకంటే ఎక్కువగా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారట. దీనికి వైసీపీ నేతలు తమదైన లాజిక్కు చెబుతున్నారట. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న మాట వాస్తవమే అయినా.. ప్రభుత్వానికి, కోర్టుకు నిమ్మగడ్డ అందజేసిన వివరాల్లో వాటి గురించి ఇంచుమించుగానే ప్రస్తావించారని గుర్తు చేస్తున్నారు.

దీపావళి మర్నాడు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో కరోనా కేసుల సంఖ్య వేయి కంటే తక్కువగా నమోదయ్యాయి. దాదాపు ఐదారు నెలల తర్వాత వేయి కంటే తక్కువ కేసులు రావడం అదే తొలిసారి. ఆ రోజున 753 కేసులే రావడంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు నిమ్మగడ్డ వచ్చేశారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ఒక్కరోజు సంఖ్యను చూసి ఏపీలో కరోనా తగ్గిపోయిందనే నిర్ధారణకు వచ్చేయడమే కాకుండా.. అందరినీ నమ్మించే ప్రయత్నం చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది వైసీపీ నేతల మాట. ఆ మర్నాడు 1395 కేసులు నమోదయ్యాయి కదా అని ప్రశ్నిస్తున్నారట.

ఇదే సందర్భంలో మరో అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు వైసీపీ నాయకులు. ఎన్నికలు జరగకపోవడంవల్ల కేంద్రం నుంచి స్థానికసంస్థలకు రావాల్సిన నిధులు.. గ్రాంట్లు రాకుండా పోతాయని నిమ్మగడ్డ చెబుతున్నట్టుగా వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. ఒకవేళ నిధులు కోల్పోతామనే బాధే నిమ్మగడ్డకు ఉంటే.. ఏ పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టలేకపోయామో.. ఆ విషయాన్ని కేంద్రానికి వివరించి నిధులు రప్పించే ప్రయత్నం చేయొచ్చుగా అంటూ తమదైన శైలిలో వాదిస్తున్నారు. ఆ విధంగా మీరు లెక్కలు తీస్తే.. మేం లాజిక్కులు తీయగలమని చెబుతున్నారట వైసీపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news