ప్రజా జీవితం మాటలు చెప్పినంత సులువు కాదన్నారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అధికారంతో సంబంధం లేకుండా 45ఏళ్లు ప్రజాజీవితంలో తాను ఉన్నానని చెప్పారు. సీఎం జగన్ మాటిచ్చి నిలబెట్టుకున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని లింగాలవలసలో నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి సమీపంలో ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోస్టర్లో స్థానిక యువత ఫొటోలు చూసి ఒకింత అసహనం వ్యక్తంచేశారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వాన్ని గుర్తించాలే తప్ప సినిమా పోస్టర్ల మీద ఫోజులిచ్చి ఫొటోలు దిగితే ప్రయోజనం ఉండదన్నారు.
‘‘సినిమా వేరు.. నిజజీవితం వేరు.. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులుంటాయి. పవన్ కల్యాణ్ రాజకీయంగా నడుస్తానంటున్నారు.. అది సాధ్యమా? పవన్ను నాతో నడవమనండి.. ఆయన రాజకీయాల్లో 3 కి.మీలు కూడా నాతో నడవలేరు. సినిమాలో బొమ్మలు పెట్టి యాక్షన్ చేస్తారు. నాకు 64 ఏళ్లు.. ఆయన నాతో నడవగలరా? ప్రజా జీవితం మాటలు చెప్పినంత సులువేం కాదు’’ అని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు.