ఖరీఫ్ మార్కెటింగ్ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం ఖరీఫ్ మార్కెటింగ్ పాలసీని ప్రకటించింది. ఆర్బీకే కేంద్రాలను ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలుగా గుర్తిస్తున్నట్టు ఖరీఫ్ మార్కెటింగ్ పాలసీలో స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలు, పీఏసీఎస్సులు, డీసీఎంఎస్సులు, రైతు మిత్రల ద్వారా ధాన్యం సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల వద్ద కావాల్సిన గోనె సంచులు, ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచాలని సివిల్ కార్పోషనుకు బాధ్యతల అప్పగించారు. అలానే ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాల్లో వివిధ శాఖల అధికారులతో కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

వరి కామన్ వెరైటీకు రూ. 18,680, వరి ఫైన్ వెరైటీకు రూ. 18,880గా రేటు నిర్ధారించారు. ధాన్యం సేకరణలోరంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యం 4 శాతానికి మించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ధాన్యం కొనుగోళ్లల్లో ఏమైనా సమస్యల పరిష్కారానికి 1902 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం సేకరణ జరగనుండగా రైతుల పండించిన పంట వివరాలను ఈ-క్రాప్ లో నమోదు చేసే బాధ్యత వీఏఏలకు అప్పగించారు. ఓ రైతు పేరు మీద 25 ఎకరాల్లో పండించిన పంట వివరాలను మాత్రమే ఈ-క్రాప్ లో నమోదు చేసుకోవాలని వీఏఏలని ఆదేశించారు. మెట్రిక్ టన్నుకు రూ. 600 మేర మిల్లర్లకు సోర్టెక్స్ ఛార్జీల చెల్లించనున్నారు. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం సరఫరా చేసే మిల్లర్లకు మెట్రిక్ టన్నుకు మిల్లింగ్ నిమిత్తం రూ. 500 చెల్లించనున్నారు. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి రీ-ఫైన్ చేసే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.