డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ నియమితులయ్యారు. అలాగే డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డీడీఆర్‌డీ)కి సెక్రటరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ నియామక ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రస్తుత డీఆర్‌డీఓ చీఫ్ జీ.సతీష్ రెడ్డిని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుడిగా కేంద్రం నియమించింది.
కామత్, సతీష్ రెడ్డి నియామకాలపై క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. 60 ఏళ్లు వచ్చే వరకు కామత్ నూతన పదవి బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. అయితే సమీర్ వి కామత్ డీఆర్‌డీఓలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. 2018లో డీఆర్‌డీఓ చీఫ్‌గా సతీష్ రెడ్డి నియమితులయ్యారు. 2020లో మరో రెండేళ్లపాటు తన పదవిని కేంద్రం పొడిగించింది.