ఒత్తిడి నిద్రకి శతృవు. దానివల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు అనేక ఇతర సమస్యలు కూడా వస్తుంటాయి. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇక్కడ సూచించిన ఆహారాలను ప్రయత్నించవచ్చు. ఇవి మిమ్మల్ని శాంతపరిచి మీ కళ్ళ మీదకి నిద్రాదేవిని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గసగసాలు
గసగసాలు మిమ్మల్ని ఓదార్చడంలో కీలకంగా ఉంటాయి. ఆలోచనలతో విసిగిపోయి ఒత్తిడికి లోనైన మనసును చల్లబర్చడానికి గసగసాలు బాగా పనిచేస్తాయి. దీనికోసం గసగసాలను తీసుకుని వేడి వేడి పాలల్లో వేసుకుని తాగాలి. ఇలా నిద్రపోయే అరగంట ముందు చేయాలి. ప్రతిరోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
చామంతి టీ
ఇందులో ఉండే ఆపిజెమిన్ కారణంగా మనసు శాంతపడుతుంది. దానివల్ల సుఖంగా నిద్ర పడుతుంది. నిద్రపోయే ముందు గ్రీన్ టీ లాంటివి తాగడం వెంటనే మానుకోండి. దానివల్ల నిద్ర దూరం అవుతుంది.
బాదం
మెగ్నీషియం అధికంగా ఉండే బాదంపప్పును క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి. మెలటోనిన్ అనే హార్మోనును ఉత్పత్తి చేయడంలో సాయపడి నిద్రను మీ దరికి చేరుస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే ట్రిఫ్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది.
అరటి పండు
పొటాషియం, మెగ్నీషియం ఉండడం వల్ల కండరాలు సడలుతాయి. ఒత్తిడికి గురైనప్పుడు లేదా బాగా ఆందోళన కలిగినపుడు అరటి పండును ఆహారంగా తీసుకోండి. ఇందులో ఉండే విటమిన్- బీ6కారణంగా నిద్ర బాగా పడుతుంది.
ఇంకా చిలగడ దుంప కూడా సాయపడుతుంది. కాల్షియం అధికంగా ఉండే దీన్ని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.