పాస్‌వర్డ్ విషయంలో మీరు ఇవే తప్పులు చేస్తున్నారా..?

-

పాస్‌వర్డ్‌ ఈరోజుల్లో ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు..ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, సోషల్‌ మీడియా అకౌంట్స్‌, బ్యాంక్‌ అకౌంట్స్‌ ఇలా ప్రతీదానికి పాస్‌వర్డ్‌ కావాలి. అయితే ఇన్ని పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది కాబట్టి మనం అన్నింటికి కలిపి ఒకటే పెట్టుకుంటాం.. ఇదే సైబర్‌ నేరగాళ్లకు మనం ఇచ్చే అవకాశంగా మారుతుంది. ఒక్కటి హ్యాక్‌ అయిందంటే మొత్తం అన్నీ అయిపోతాయి. తాజాగా వేలాది మంది డిస్నీ+ వినియోగదారులు భారీ హ్యాకింగ్ బారిన పడ్డారు. తమ అకౌంట్లను కోల్పోయారు. ఆ హ్యాక్ చేయబడిన ఖాతాలు డార్క్ వెబ్‌లో విక్రయించబడినట్లు ‘ది మార్కెట్ రియలిస్ట్’ వెల్లడించింది. సాధారణంగా పాస్ వర్డ్ ఎంపికలో వినియోగదారులు చేసే తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌ను ఎంచుకోవడం

పాస్ వర్డ్స్ విషయంలో అందరూ చేసే మొదటి తప్పు సులభంగా కనిపెట్టగలిగే పాస్‌వర్డ్‌ పెట్టుకోవడం. సాధారణంగా పాస్ వర్డ్స్ విషయంలో పుట్టిన రోజులు ఉపయోగించడం, లేదంటే 1234 లాంటి సాధారణ పాస్‌ వర్డ్‌లను పెట్టుకుంటారు. బ్రాండ్ పేర్లు, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లతోనే పాస్ వర్డ్స్ ఏర్పాటు చేసుకుంటారు. వీటిని హ్యాకర్లు ఈజీగా గుర్తిస్తారు.

సరిపడ నెంబర్స్,స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకోకపోవడం

పాస్ వర్డ్ పెట్టుకునే సమయంలో నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ వినియోగించడం మంచిది. వీటితో పాస్వర్డ్ కఠినంగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు kr3st3v@798! లాంటి పాస్‌వర్డ్స్‌ను ఉపయోగించడం ఉత్తమం. ఇది మనకు గుర్తుండదు అనుకుంటే రాసి పెట్టుకోండి..

చాలా సైట్‌లకు ఒకే పాస్‌వర్డ్‌ని ఉపయోగించడం

ప్రతి అకౌంట్ లాగిన్ చేయడానికి ఒకే పాస్‌వర్డ్‌ను వాడటం చాలా మంది చేసే పెద్ద తప్పు. కేవలం ఒక సెట్ లాగ్ ఇన్ ఆధారాలతో, హ్యాకర్లు అదే ఇమెయిల్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి ఇతర సైట్‌లకు లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వేర్వేరు అకౌంట్లకు వేర్వేరు పాస్ వర్డ్స్ పెట్టుకోవాలి.

మీ పాస్‌ వర్డ్స్ ఎప్పుడు మార్చాలి?

ప్రతి సంవత్సరం మీ పాస్‌ వర్డ్‌ను మార్చుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇది కొంత ఇబ్బంది అయినా, మంచి నిర్ణయమే.

చాలా చిన్న పాస్‌వర్డ్‌ పెట్టుకోకూడదు

చిన్న చిన్న పాస్ వర్డ్స్ పెట్టుకోవడం అస్సలు సరికాదు. సాధారణంగా 15 కంటే ఎక్కువ నెంబర్స్, క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉండటం మూలంగా హ్యాకింగ్ నుంచి తప్పించుకునే అవకాశం బాగా ఉంది.

పాస్‌వర్డ్‌లను సురక్షితంగా లేని ప్రదేశాలలో నిల్వ చేయడం

సురక్షితంగా లేని ప్రదేశాలలో పాస్ వర్డ్స్ సేవ్ చేయకూడదు. ప్రస్తుతం పాస్ వర్డ్స్ స్టోర్ చేసుకునే సురక్షిత ప్రదేశాలు అందుబాటులోకి వచ్చాయి. Google పాస్ వర్డ్ మేనేజర్‌ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. Appleలో పాస్‌ వర్డ్‌ని స్టోర్ చేసే కీచైన్‌ని కలిగి ఉంది.

హానికరమైన పాస్‌వర్డ్ జనరేటర్‌లను ఉపయోగించడం

పాస్‌వర్డ్‌లను రూపొందించే ఆన్‌లైన్ సేవలపై ఆధారపడకూడదు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. కాబట్టి, ప్రజలు ఆన్‌లైన్ పాస్‌వర్డ్ ఉత్పత్తి సేవలను ఉపయోగించకుండా ఉండటం మంచిది.

ఇలాంటి జాగ్రత్తలు పాటించి మీ అకౌంట్స్‌ను సురక్షితంగా ఉంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news