మాల్దీవులు.. ప్రస్తుతం బాలీవుడ్ , టాలీవుడ్, కోలీవుడ్ సహా సినిమా సెలెబ్రిటీలందరూ వెకేషన్ కోసం మాల్దీవులు వెళ్తున్నారు. దీంతో మాల్దీవులు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. వెకేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఏకైక ప్లేస్ గా నిలిచింది. మహమ్మారి తర్వాత రీస్టార్ట్ అయిన మాల్దీవులకి ఇండియన్ టూరిస్టుల రాక గణనీయంగా పెరిగింది. గతంలో 20-25శాతం దర్శించుకునేవారు, ఇప్పుడు 60శాతానికి పెరిగిపోయారు. మాల్దీవులకి వచ్చే సందర్శకుల్లో మూడవ స్థానంలో ఇండియానే ఉంది.
ఐతే కరోనా కారణంగా అక్కడి నియమాలు చాలా మారిపోయాయి. అలా మారిపోయిన నియమాలు అక్కడికి వెళ్ళేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
ముందుగా, కరోనా నెగెటివ్ అన్న రిపోర్టు ఉండాలి. అది కూడా 72గంటల ముందు టెస్ట్ చేసుకున్నదై ఉండాలి. అలాగే మాల్దీవులకి వచ్చే వారైనా, వెళ్ళేవారైనా 24గంటల ముందే, తమ ఆరోగ్యానికి సంబంధించి డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ అక్కడ కరోనా పాజిటివ్ అని తేలితే, హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నియమాలు పాటించాల్సి ఉంటుంది. అదీగాక ఒక దీవి నుండి మరో దీవికి వెళ్ళడానికి అవకాశం ఉండదు.
సందర్శకులందరూ ఖచ్చితంగా ట్రేస్ ఎకీ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సందర్శకులు మిస్ అయితే ఈ యాప్ ద్వారా సురక్షిత ప్రదేశానికి చేరుకోవచ్చు.
ప్రపంచ ప్రయాణ, సందర్శన సంఘం మాల్దీవులని సురక్షిత ప్రదేశంగా గుర్తించింది. ఇప్పటివరకు అక్కడ నమోదయిన కరోనా కేసుల సంఖ్య 14వేలు ఉండగా 48మంది కరోనాతో మరణించారు.
మరింకేం, కరోనా తెచ్చిన నెగెటివిటీని పోగొట్టుకోవడానికి, కొత్త ఉత్సాహం తెచ్చుకోవడానికి, కొత్త ప్రదేశాలకి వెళ్ళాలని అనిపిస్తే, మాల్దీవులకి ప్లాన్ చేసుకోండి మరి.