ఆర్యన్ ఖాన్ బెయిల్ షరతుల్లో మార్పులు

బాలీవుడు నటుడు షారూక్ ఖాన్, ఆయన కుటుంబానికి భారీ ఉపశమనం కలిగింది. ప్రతి వారం ఎన్‌సీబీ ఆఫీస్‌కు హాజరు కావడంపై ఆర్యన్‌ఖాన్‌కు మినహాయింపు ఇస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయానికి హాజరు కావాలనే షరతుపై ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బెయిల్ నిబంధనల్లో మార్పులు కోరుతూ 23ఏండ్ల ఆర్యన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

ఆర్యన్ ఖాన్ పిటిషన్‌పై సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే విచారణ జరిపారు. ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం హాజరు కావాలనే షరతుపై బెయిల్ మంజూరు చేశారు. దీనిని నుంచి మినహాయింపును ఇస్తూ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ సమయంలో విధించిన మరో షరతును కూడా కోర్టు సవరించింది. ముంబయి వీడి వెళ్లిన ప్రతిసారి ప్రయాణ వివరాలను ఎన్‌సీబీకి అందజేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నది.