ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బాంబే హై కోర్ట్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. షారుఖ్ ఇళ్లు మన్నత్ ముందు ఫ్యాన్స్ హంగామా చేశారు. కాగా లక్ష రూపాయల విలువైన బాండ్ పై బెయిల్ ఇస్తూ బాంబే హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్ తోపాటు, అర్బాజ్ ఖాన్, మున్ మున్ దామేచా గురువారం బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే ఒకటి కన్నా ఎక్కువ పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. ఎన్సీబీ అధికారి అనుమతి లేకుండా ముంబై కానీ దేశం కానీ వదిలి వెళ్లకూడదని షరతులు విధించారు. పాస్ పోర్టులను సరెండర్ చేయాలని నిబంధన విధించింది. ఇలాంటి కార్యకలాపాలకు మళ్లీ పాల్పడవద్దని, కేసు గురించి బహిరంగ ప్రకటనలు చేయవద్దని, ప్రతీ శుక్రవారం విచారణ నిమిత్తం ఎన్సీబీ అధికారుల ముందు తప్పకుండా హాజరు కావాలని షరతులు విధించింది. సాక్ష్యులను ఏవిధంగా ప్రభావితం చేయకూడదని కోర్ట్ ఆదేశించింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే ఎన్సీబీ నిందితుల బెయిల్ రద్దు చేయమని కోరవచ్చని బెయిల్ ఉత్తర్వులతో పేర్కొంది. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు బెయిల్ ఉత్తర్వులను వెలువడినా..జైలు అధికారులకు సకాలంలో జైలు అధికారులకు చేరకపోవడంతో ఆర్యన్ ఖాన్ శనివారం విడుదలయ్యే అవకాశం ఉంది.