ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం అయిన ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై నిన్న తుపాకులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. అయితే ఈ ఘటనపై పాతబస్తీలో హైటెన్షన్ నెలకొంది. ఘటన తర్వాత గత రాత్రి నుంచి ఎంఐఎం నేతల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు నేడు శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా… పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీదుతో పాటు పలు సున్నిత ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సౌత్ జోన్ ప్రాంతాల్లో కూడా బందోబస్తును కట్టుదిట్ట చేశారు. కమాండ్ కంట్రోల్ సంబంధించి మొబైల్ టీంను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎంఐఎం నేతలతో కూడా పోలీసులు చర్చిస్తున్నారు. శాంతియుతంగా నిరసనలను వ్యక్తం చేసేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు.