నేడు ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ సభ్యులపై సభాపతి సస్పెన్షన్ వేటు వేశారు. అయితే.. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన టీడీపీ నేతలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 17 మందికి సమాధానం చెప్పలేకపోయారంటూ అచ్చెన్నాయుడు అధికార పక్షంపై ధ్వజమెత్తారు. 200 మంది మార్షల్స్ సాయంతో నచ్చినట్టు సభను నడిపించుకోవడానికే తమను బయటకు పంపారు అని వ్యాఖ్యానించారు.
“చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపితే, మా నాయకుడికి జరిగిన అన్యాయంపై మేం అసెంబ్లీలో మాట్లాడకూడదా? చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించాలని… ఆయన్ని వెంటనే విడుదల చేయాలని… శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లతో టీడీపీ సభ్యులందరం సభకు వెళ్లాం. రాష్ట్ర శాసనసభ ఏర్పడినప్పటినుంచీ ఏనాడు సభలో జరగనివి నేడు జరిగాయి. ఈరోజు నిజంగా శాసనసభకు దుర్దినమే. మంత్రిగా ఉన్న వ్యక్తి మీసం తిప్పి తొడగొడితే… దానికి మా సభ్యుడు బాలకృష్ణ స్పందించారు. శాసనసభ సాక్షిగా ప్రజలకు తప్పుడు సందేశం ఇవ్వాలని స్పీకరే ప్రయత్నించారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికి అధికారపార్టీ శాసనసభ్యుల వెకిలిచేష్టలు, వెర్రిమొర్రివేషాలు కనిపించలేదు. సభ్యసమాజం తలదించుకునేలా వారు మాట్లాడిన మాటలు ఆయనకు వినిపించలేదు.