నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేస్తూ ప్రవర్తించడంతో వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. టీడీపీ ఎమ్మెల్యేలను సభాపతి సస్పెండ్ చేశారు. అయితే.. అసెంబ్లీ నుంచి బయటికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగుల్లో టీడీపీని తిడితే, వైసీపీ ఎమ్మెల్యేలు సభలో తిడుతున్నారని మండిపడ్డారు. శాసనసభ అంటే వైసీపీ కార్యాలయం అనే భావనలో ఉన్నారని ధ్వజమెత్తారు పయ్యావుల కేశవ్. “వీళ్లకు సభలో ఎలా వ్యవహరించాలో తెలియదు… ఎవరైనా చెబితే అభద్రతాభావంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. మేం ఇంకా మాట్లాడితే చివరకు సస్పెన్షన్ వరకు వెళుతున్నారు. పాలకుల విధానం బుల్డోజ్ చేయడమే. ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగుల్లో తెలుగుదేశాన్ని తిడతాడు… అధికారపార్టీ వాళ్లు బయటతిట్టింది చాలక… అసెంబ్లీలో కూడా తిడుతున్నారు. శాసనసభలో ఉన్నామా… బయట పబ్లిక్ మీటింగ్ లో ఉన్నామా అనే ఆలోచన వాళ్లకు ఉండటంలేదు.
చంద్రబాబునాయుడిని పవన్ కల్యాణ్ కలిస్తే దానిపై ముఖ్యమంత్రి ములాఖత్ లో మిలాఖత్ అయ్యారని మాట్లాడారు. ఆ మాటలు విన్నాక ముఖ్యమంత్రికి ఆలోచనా శక్తి తగ్గిందనే అనుమానం కలిగింది. ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి గతం గుర్తుచేసుకోవాలి. ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు ఎన్ని మిలాఖత్ లు అయ్యాయో తెలియదా? అప్పుడే మర్చిపోయారా?. వైసీపీ పుట్టుక మొదలైందే ములాఖత్ లు, మిలాఖత్ లతో కదా! ఆ విషయం మర్చిపోయి ఆయన మాట్లాడితే ఎలా? ఆయన ఢిల్లీ వెళ్లి ఎవరితో ఎప్పుడు ములాఖత్ అయ్యి… మిలాఖత్ లు జరుపుతున్నారో తెలియదా? ఆయనపై ఉన్న కేసుల విచారణ ఆగిపోవడానికి ఏ ములాఖత్ లు… ఏ మిలాఖత్ లు కారణమో ఆయనే చెప్పాలి.