అక్రమాల కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా బెయిల్ పై విడుదలయిన సంగతి తెలిసిందే. సుమారు రెండు నెలల పాటు ఊచలు లెక్కపెట్టిన ఆయన.. కడప సెంట్రల్ జైల్ నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ క్రమంలో మరోసారి దురుసుగా ప్రవర్తించారు.. “వంకర” మారదని నిరూపించినంత పనిచేశారు! ఫలితంగా… వచ్చినంత సేపు లేకుండానే.. పోలీసులు మళ్లీ పట్టుకుపోతారనే మాటలు సీమ కేంద్రంగా వినిపిస్తున్నాయి!
అవును… అక్రమాల కేసులో సుమారు 58రోజుల అనంతరం బెయిల్ పై విడుదలవుతున్న నేపథ్యంలో కడప సెంట్రల్ జైల్ దగ్గర రచ్చ రచ్చ చేశారు జేసీ & కో! జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డిల విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… జైలు నుంచి భారీ వాహనాల నడుమ తాడిపత్రికి బయల్దేరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఈ విషయంలో స్పందించిన పోలీసులు… కోవిడ్ కారణంగా వాహన శ్రేణికి అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు!
దాంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను జైలు నుంచి విడుదలయిన సందర్భంగా తన అభిమానులు ఘనంగా, భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటుంటే అడ్డుకుంటారా అంటూ నిప్పులు తొక్కారు. దీంతో… జేసీ ఫ్యామిలీతో పాటు మరో 31 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఫలితంగా… కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారంటూ వీరిని వీలైనంత తొందర్లో మళ్లీ పోలీసులు పట్టుకెళ్లిపోయే సూచనలు ఉన్నాయని అంటున్నారు!