హిందూపురం ఎమ్మెల్యే, నట సింహం నందమూరి బాలకృష్ణ టీడీపీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ, తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను మనసారా పొగిడారు. ఇప్పటికీ పాతతరం వాళ్ల చిత్రాలు బతికున్నాయంటే అది ఎన్టీఆర్ నటించిన చిత్రాల వల్లేనని వెల్లడించారు ఆయన.
“ఎన్టీఆర్ తన సినిమాల్లో భక్తి రసాన్ని బతికించారు. మన సంస్కృతి సంప్రదాయాలను తన సినిమాల్లో కంటికి అద్దెటట్టు చూపించారు . ఆయన పౌరాణికాల్లో నటిస్తే ప్రాణం పోసుకున్నాయి, జానపదాల్లో నటిస్తే జావళీలు పాడాయి. సాంఘిక చిత్రాలేమో సామజవరగమనాలయ్యాయి, పద్యం పదునెక్కింది, పాట రక్తి కట్టింది. కళామతల్లి కళకళలాడింది, కనుల పండువలా నవ్వింది. ఎన్టీఆర్ నటించని పాత్ర లేదు, ఆయన చేయని సినిమా లేదు. ప్రతి పాత్రను అణువణువు నింపుకుని నటించారు.
ప్రతి బిడ్డకు, మట్టి గడ్డకు కూడా నేను తెలుగువాడ్ని అని సగర్వంగా చెప్పుకునే ఆత్మవిశ్వాసాన్ని, దమ్ము ధైర్యం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో ఎన్టీఆర్ కు ముందు, ఎన్టీఆర్ కు తర్వాత అని చెప్పుకోవాలి. ఎన్నో పథకాలను సాహసోపేతమైన రీతిలో అయన ప్రారంభించారు. పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే… పేదల భవితకు భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే… మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన అన్న ఆయనే” అంటూ తన తండ్రి, టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ గురుంచి కీర్తిస్తూ ప్రసంగించారు బాలకృష్ణ.