తెలుగులో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పల్లె పద్దతులు, జీవన స్థితిగతులను చూపిస్తూ మూవీలు ఈ మధ్య కాలంలోనే అప్పుడప్పుడూ వస్తున్నాయి. అలాంటి చిత్రమే ‘బలగం’. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సామాన్య పరిస్థితుల నేపథ్యంతో రూపొందిన ఈ మూవీని టాలీవుడ్‌లో కమెడియన్‌గా సత్తా చాటుతోన్న జబర్ధస్త్ వేణు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
చిన్న సినిమాగా రిలీజై పెద్ద హిట్ ను సొంతం చేసుకున్న చిత్రం బలగం. తెలంగాణ గ్రామీణ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ మూవీతో ప్రముఖ కమెడియన్ వేణు యెల్దండి కూడా ఎంత ఎత్తుకి ఎదిగారో తెలిసిందే. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించారు. ఈనెల 3న విడుదలైన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ సంగీతాన్నిఅందించాడు. రిలీజైన తొలిరోజు నుంచి మంచి ఆదరణతో థియేటర్స్ లో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లో విడుదలైన 20 రోజులకే ఈ మూవీ డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ కావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం మార్చి 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.