టీఆర్ఎస్ కళ్లు మునుగోడు భూములపై పడ్డాయి : బండి సంజయ్

-

మునుగోడులో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా దిగిందని.. నియోజకవర్గంలో భూములన్నీ కబ్జా చేసేందుకు రెడీగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు నియోజకవర్గ భూములపై పడ్డాయని అన్నారు. ఎన్నికల ప్రచారం పేరుతో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడులో ఊరూరా తిరుగుతూ భూముల గురించి ఆరా తీస్తున్నాయని మండిపడ్డారు.

టీఆర్ఎస్ గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గంలోని భూములన్నీ కబ్జా చేయబోతున్నారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.40 వేలు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఆ పైసలన్నీ కచ్చితంగా తీసుకోవాలని, ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేసి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ తిరుగుండ్లపల్లి, తమ్మడపల్లిలో రోడ్ షోలో పాల్గొన్నారు.

“ఇన్నాళ్లు టీఆర్ఎస్ నేతలు సంపాదించిన డబ్బలు సరిపోనట్లున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు భూముల మీద పడ్డాయి. ఊరూరూ తిరుగుతూ భూముల గురించి ఆరా తీస్తున్నారు. రేపు టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ భూములన్నీ కబ్జా చేయబోతున్నారు. హుజూరాబాద్, దుబ్బాకలో ఎన్నికలొచ్చాయి కాబట్టే అక్కడ అంతో ఇంతో అభివృద్ధికి నిధులొచ్చాయి.  మునుగోడులో కూడా అంతే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయంగానే గట్టుప్పల్ మండలం ఏర్పాటైంది. కొత్త రోడ్లు మంజూరు అవుతున్నాయి.  గొర్లకు డబ్బులొస్తున్నాయి.  ఇన్నాళ్లుగా దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, పెన్షన్లు ఇవ్వాలని అడిగితే ఏనాడూ కేసీఆర్ పట్టించుకోలేదు. ఎన్నికలు రాగానే అన్నీ ఇస్తామని ఆశపెడుతున్నారు.” – బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Read more RELATED
Recommended to you

Latest news