రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తనకు లీగల్ నోటీసులు పంపినట్లు వస్తోన్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఎలాంటి నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. చట్టపరంగా, న్యాయబద్ధంగా తగిన సమాధానమిస్తామని తెలిపారు. రాజకీయంగా, ప్రజాక్షేత్రంలో పోరాడతాం తప్ప.. కేసీఆర్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడమని తేల్చి చెప్పారు. కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే దాకా పోరాడతామన్నారు.
టీఎస్పీఎస్సీతో తనకు సంబంధం లేదని కేటీఆర్ చెప్పడం పెద్ద జోక్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆయనకు ఏ సంబంధం లేకపోతే సీఎం నిర్వహించే సమీక్షలో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. పేపర్ లీకేజీకి ఇద్దరు వ్యక్తులే తప్ప కమిషన్ తప్పిదం లేదని కేటీఆర్ ఎలా చెప్పారని నిలదీశారు. లీకేజీ వెనుక బీజేపీ, బండి సంజయ్ కుట్ర ఉందని ఏ విధంగా ఆరోపణలు చేస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల తరఫున కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రిగా ఉంటూ ఆయన స్పందిస్తే తప్పు లేనప్పుడు.. ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా తాము మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు.