సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ బహిరంగ లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కి బహిరంగలేఖ రాశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ పోలీసు నియామకాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను వెంటన సవరించాలని లేఖలో పేర్కొన్నారు.

“రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన దేహధారుడ్య పరీక్షలను నోటిఫికేషన్ లో పేర్కొన్న దానికి భిన్నంగా నిర్వహించినట్లు అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో నోటిఫికేషన్ లో చెప్పిన దానికి భిన్నంగా అధికారులు వ్యవహరించడంవల్ల దాదాపు 2 లక్షల మంది పురుష, మహిళా అభ్యర్థులు అర్హత సాధించలేకపోయినట్లు మా ద్రుష్టికి వచ్చింది. అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీసు ఉద్యోగాల నియమాక ప్రక్రియ మొదటి నుండి వివాదాలకు తావిచ్చేలా వ్యవహరిస్తుండటం దురద్రుష్టకరం. ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల విషయంలోనూ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించకోకపోవడం బాధాకరం. తాజాగా దేహదారుఢ్య పరీక్షల్లోనూ నోటిఫికేషన్ కు భిన్నంగా కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయడం అన్యాయం. దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ లాంగ్ జంప్ డిస్టన్స్ 3.8 మీటర్లుగానే ఉంది. మన రాష్ట్రంలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడంవల్ల అభ్యర్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది.

లాంగ్ జంప్ తోపాటు షాట్ పుట్ విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలి. లాంగ్ జంప్ లో ఆన్ ది లైన్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకుగాను అభ్యర్థులందరికీ మార్కులు కలపాలని కోరుతున్నాం. తక్షణమే జరిగిన తప్పిదాలను సరిదిద్ది లక్షలాది మంది అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం” అని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news