మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 రన్స్ చేసి.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. బొటనవేలి గాయంతో చివర్లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత పోరాటం వృథా అయింది. రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఆఖర్లో 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, ముస్తాఫిజూర్ రెహ్మాన్ విసిరిన ఆ ఓవర్లో రోహిత్ శర్మ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి ఆశలు కల్పించాడు. చివరి బంతికి సిక్స్ కొడితే విజయం దక్కుతుందనగా, ముస్తాఫిజూర్ యార్కర్ వేయడంతో రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టేందుకు సాధ్యపడలేదు. దాంతో టీమిండియా స్కోరు 266 పరుగుల వద్ద నిలిచిపోయింది.
గాయం కారణంగా చివర్లో బ్యాటింగ్ కు దిగిన రోహిత్ ఎడాపెడా బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అప్పటికే 9 వికెట్లు పడిపోయినా రోహిత్ పోరాటం ఆపలేదు. కానీ ఇన్నింగ్స్ చివరిబంతిని ముస్తాఫిజూర్ తెలివిగా యార్కర్ వేయడంతో రోహిత్ సిక్స్ కొట్టేందుకు విఫలయత్నం చేశాడు. కాగా, ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను ఆతిథ్య బంగ్లాదేశ్ 2-0తో గెలుచుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య మూడో వన్డే నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్ డిసెంబరు 10వ తేదీ చట్టోగ్రామ్ లో జరగనుంది.