ఏటీఎంలో నగదు నింపేందుకు వెళ్లే వాహనాలపై తరచూ దాడులు జరగడం లేదా వాహనంలో ఉన్న వ్యక్తులే నగదుతో ఉడాయించడం వంటి ఘటనల గురించి వింటుంటాం. ఇక నుంచి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలలో నగదు నింపేందుకు వెళ్లే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు విధించింది. ఇవే కాకుండా రాష్ట్ర హోం శాఖ మరికొన్ని తాజా నిబంధనలు రూపొందించింది. అవేంటంటే..?
వాహనంలో డ్రైవర్‌తోపాటు ఇద్దరు కస్టోడియన్లు, కనీసం ఇద్దరు శిక్షణ పొందిన సాయుధగార్డులు తప్పనిసరిగా ఉండాలి. గార్డుల్లో ఒకరు ముందు సీట్లోను.. మరొకరు వెనకన కూర్చోవాలి. ఏజెన్సీలు సంబంధిత సిబ్బందిని నియమించుకునే సమయంలో వారి ప్రవర్తనపై అనేక అంశాలకు సంబంధించి పరిశీలన చేయాలి. ఎప్పటికప్పుడు వారికి తగిన శిక్షణ ఇవ్వాలి.
నగదును తీసుకెళ్లే వాహనాల కదలికలను నిత్యం తెలుసుకునేందుకు వీలుగా కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో ట్రిప్పులో రూ.5 కోట్ల లోపు మాత్రమే నగదును తీసుకెళ్లాలి.
ఏజెన్సీలు నగదును భద్రపరిచే ప్రాంతం పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉండేలా చూసుకోవాలి. చిన్న పట్టణాల్లోని ప్రాంగణాల్లో రూ.10 కోట్ల లోపు నగదు మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. ఈ ప్రాంగణానికి ‘24/7’ సీసీ కెమేరా నిఘాతోపాటు సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ ఉండాలి.
నగర ప్రాంతాల్లో రాత్రి 9 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల్లోపు మాత్రమే ఏటీఎంలలో నగదు నింపాలి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపే ఈ పని చేయాలి.