ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద “కర్తవ్య పథ్” లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా “బతుకమ్మ” వేడుకలు జరిగాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చిన మహిళలు మధ్యాహ్నం నుంచే “బతుకమ్మ”లను అందగా పలురకాల పూలతో పేర్చడంతోపాటు, సాయంత్రం ఉత్సాహంగా “బతుకమ్మ” ఆడారని తెలిపారు.
ఢిల్లీ గడ్డపై “కర్తవ్య పథ్” వేదికగా “బతుకమ్మ” సంబరాలు జరుపుకోవడం తెలంగాణకు మరింతగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కిందన్నారు. “హైదరాబాద్ విమోచన దినోత్సవాల్లో” భాగంగా ఏడాదిపాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఢిల్లీలో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
నాడు రజాకార్లు మన ఆడబిడ్డలను అవమానిస్తూ నగ్నంగా “బతుకమ్మ”ను ఆడించిన రోజుల నుంచి
నేడు స్వేచ్ఛగా మన సోదరీమణులు, యువతులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడుకునే అవకాశం దక్కడం వెనక ఎంతో మంది త్యాగాల తో పాటు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేకమైన చొరవ ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి సరైన గుర్తింపును కల్పించేందుకు
ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవ ఉత్సవాలలో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఇండియా గేట్, కర్తవ్య పథ్ వద్ద ఘనంగా నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించిన చిత్రాలు. @MinOfCultureGoIhttps://t.co/V6Y3QpTqyf pic.twitter.com/sVxA77QzVm
— G Kishan Reddy (@kishanreddybjp) September 27, 2022