కరోనా నేపథ్యంలో ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ యూఏఈలో జరుగుతున్న విషయం విదితమే. అయితే ఈ టోర్నీకి కేంద్రం నుంచి బీసీసీఐకి అధికారిక అనుమతి లభించింది. టోర్నీని దుబాయ్‌లో నిర్వహించుకోవచ్చంటూ గతంలో కేంద్రం మౌఖికంగా తెలిపింది. అయితే అందుకు సంబంధించిన పత్రాలను మాత్రం ఇప్పటి వరకు కేంద్రం బీసీసీఐకి ఇవ్వలేదు. కాగా సోమవారం అవి బీసీసీఐకి అందాయి. దీంతో ఐపీఎల్ ఇప్పుడు అధికారికంగా యూఏఈకి షిఫ్ట్ కానుంది.
కాగా ఐపీఎల్‌ను సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నిర్వహిస్తారు. టోర్నీని పూర్తిగా బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో నిర్వహిస్తారు. దీంతో ప్లేయర్లు కేవలం హోటల్స్ కు, మ్యాచ్ లు జరిగే స్టేడియాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆగస్టు 20వ తేదీ తరువాత ప్లేయర్లు దుబాయ్‌కు వెళ్తారు. అక్కడే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. తరువాత టోర్నీకి ప్రాక్టీస్ చేస్తారు.
బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంచైజీలకు టోర్నీ విషయమై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ని అందజేసింది. అందులో ఫ్రాంచైజీలు, ప్లేయర్లు టోర్నీ సందర్భంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు.. అనే వివరాలు ఉంటాయి. అలాగే ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్ గా ఉన్న వివో తప్పుకోవడంతో ప్రస్తుతం బీసీసీఐ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ కోసం వేట చేపట్టింది. అమెజాన్, పతంజలి, డ్రీమ్ 11 తదితర సంస్థలు ఇందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.