గతంలో ఏపనీ పాటా లేకుండా ఖాళీగా ఉన్న వారిపై రకరకాల సామెతలతో కూడిన సెటైర్లు ప్రాచుర్యంలో ఉండేవి. వాడు ఏమి చేస్తున్నాడురా అంటే… గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నాడని, పోతు గాడిదకు పాలు పితుకుతున్నాడని,పిల్లి తలలో పేలు చూస్తున్నాడని.. రకరకాలుగా కామెంట్స్ చేసేవారు. అవి నిజమైనా కూడా సమాజానికి వచ్చిన నష్టం ఏమీ లేదు!! కానీ.. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ఖాళీ బ్యాచ్ కొందరు చేస్తున్న పనికిమాలిన ఫేక్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.
ఇలాంటి వారిని ఊరికే వదిలేస్తేనో,కౌన్సిలింగ్ ఇచ్చి పంపేస్తేనో ప్రయోజనం లేదని భావించిన రక్షక భటులు.. ఈ ఖాళీ బ్యాచ్ పై ఐపీసీ సెక్షన్స్ పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు.. శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపేస్తున్నారు!! మొన్నటికి మొన్న వెస్ట్ బెంగాల్ లోని ఒక మహిళ ఇలాంటి పనికిమాలిన పనిచేస్తే… ఆమెపై ఐపీసీ 505 (1)(బ్)/2 సెక్షన్స్ కింద కేసు బుక్ చేశారు పోలీసులు. ఇదే తరహాలో ముంబయి లో సుమారు 130కి పైగా కేసులు నమోదు చేశారు. ఈ దరిద్రం మన దేశంలోనే అనుకుంటే పొరపాటే… ఫిలిప్పైన్స్ లో కూడా సుమారు 30కి పైగా ఈ ఫేక్ న్యూస్ బ్యాచ్ పై కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్ సెంటర్‌గా ఏర్పాటు చేశారంటూ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాకు చెందిన
ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి (56) అనే వ్యక్తి తన ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల్లో ఫేక్ పోస్టులు పెట్టాడు.
అక్కడితో ఆగకుండా తగుదునమ్మ అంటూ వాట్సాప్ ద్వారా కూడా తెగ షేర్లు కొట్టేశాడు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఏముందిలే కేసులు పెడతారు, తర్వాత వదిలేస్తారు అని లైట్ తీసుకునేరు… ఇలా తప్పుడు పోస్టులు, పనికిమాలిన షేర్లు చేసేవాళ్లపై ఐపీసీ సెక్షన్ 153, 188, 505, 269లతో పాటు ఐపీసీ సెక్షన్ 10 (2),(1) ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్–2005, సెక్షన్ 66 ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తే, నేరం రుజువైతే 2 ఏళ్లకు పైగా ఊచలు
లెక్కపెట్టాల్సిందే. కరోనా గురించి ప్రపంచం మొత్తం వణికి పోతుంటే… ఈ ప్రజల భయాన్ని, జాగ్రత్తని తప్పుదోవ పట్టిస్తూ.. తోచిన పోస్టులు పెడుతున్న వారిని కఠినంగా శిక్షించడంలో తప్పేమీ లేదనేది విశ్లేషకులవాదనగా ఉంది!