కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ ఫిల్మ్ ఈ నెల 13న విడుదల కానుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. కాగా, ఈ చిత్రానికి చుక్కెదురైంది. ఆ దేశంలో మూవీ ప్రదర్శనను నిలిపేశారు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ పిక్చర్ లో విజయ్ స్పైగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆధారంగా సినిమా స్టోరిపై అంచనాకు వచ్చిన గల్ఫ్ దేశమైన కువైట్ లో నిషేధించారు.
సాధారణంగా మధ్యప్రాచ్య దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తారనే టాక్ ఉంది. ఈ క్రమంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కు ఆ దేశం వారు సహకరిస్తారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ‘బీస్ట్’ చిత్రాన్ని కువైట్ లో బ్యాన్ చేయడం సంచలనంగా మారింది. ఓ షాపింగ్ మాల్ ను హైజాక్ చేసే ఉగ్రవాదులకు గల్ఫ్ కనెక్షన్ ఉందన్న ప్రచారం నేపథ్యంలోనే ఈ మేరకు నిషేధం జరిగినట్లు తెలుస్తోంది.
కువైట్ ప్రభుత్వం ‘బీస్ట్’ సినిమా విడుదలను నిషేధించింది. కానీ, యూఏఈతో పాటు మరి కొన్ని అరబ్ దేశాల్లో మాత్రం అలా నిషేధాజ్ఞలు అయితే రాలేదు. ఈ కోలీవుడ్ ఫిల్మ్ ను అన్ని భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో దుల్కర్ సల్మాన్ చిత్రం ‘కురుప్’ను కువైట్ లో నిషేధించారు. తాజాగా ‘బీస్ట్’పైన నిషేధం విధించారు. ఈ సంగతులు పక్కనబెడితే ఇళయ దళపతి వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నారు.
ఆయన నటించిన గత చిత్రం ‘మాస్టర్’ కొవిడ్ టైంలో రిలీజ్ అయి రికార్డులు సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే ‘బీస్ట్’పైన కూడా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఫిల్మ్ ను తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.