జీవితాన ప్రేమ విశిష్ట అతిథి
గౌరవం ఇవ్వడం వరకూ
పొందడం వరకూ అన్నీ ప్రేమలో బాగుంటాయి
ఆశాభంగం అయ్యాక ప్రేమలో అన్నీ చెడి ఉంటాయి
మంచిలోనూ చెడుతోనూ కుదురే ఉండదు
ప్రేమ అన్నది సఫలం సౌకర్యవంతం ఇంకా కొన్ని విషయాల్లో ఇంకాస్త స్వేచ్ఛకు సంకేతం కూడా! మనుషుల్లో కుదురు లేకుండా చేసే ప్రేమలే ఎక్కువ ఉంటాయి. అవి యవ్వన ప్రాయ ప్రేమలు.. ఇవి నిలబడినా తడబడినా కొన్ని రోజులే! వాటి కొనసాగింపును చాలా కాలం వరకూ చూడడం అన్నది అత్యాశ అవుతుంది.ప్రేమ నిడివి పెరిగే కొద్దీ కొన్నిసార్లు విముఖత తీవ్రత కూడా పెరుగుతుంది. ప్రేమ నిడివి కొద్ది కాలం పాటే అయిందనుకోండి ఇంకొన్ని రోజులకు నిజాలన్నవి వెలుగులోకి వస్తాయి. నిజాలను అంగీకరించలేని ప్రేమ ఉత్త దండగ!
ప్రేమ అయినా ద్వేషం అయినా ఒక చోట మాత్రమే ఉంటాయా? మనుషులు సంపాదించుకున్నవన్నీ ప్రేమ సంబంధితాలే ఎందుకు అవుతాయి? కోరికలకు అనుగుణంగా కూడా కొన్ని ఉండాలే! ఉంటాయి కూడా! ప్రేమలో విఫలతను అందాల నటి సమంత అంగీకరిస్తుందా ? ప్రేమలో విఫలతకు కారణంగా నిలిచిన సందర్భాలను సన్నివేశాలను తిట్టుకుంటుందా?
కుదురేలేని ప్రేమలున్నాయి కుదురేలేని భావనలు ఉన్నాయి. భావోద్వేగాలు అన్నవి ఒక చోట నుంచి మరోచోటకు మారిపోతూ ఉంటాయి. ఉన్నవన్నీ చిన్న చిన్న కలలు. వీటి నుంచి నేర్చుకోవాల్సినంత గెలుచుకోవాల్సినంత ఓడి తీరి గెలిపించినంత జీవితం ఒదిగి ఉంటుంది. కలలన్నవి మనిషి కి ఉద్వేగ చిహ్నాలే కానీ వాటి నెరవేర్పు ఓ అసాధ్యత నుంచి మరో అసాధ్యత వరకూ ఉండాలి. ఉంటేనే జీవితం బాగుంది. ఇతరులకు సాధ్యం కాని పనుల కారణంగా కలలు నెరవేరుతాయి. ప్రేమ ప్రకటితం అయి విజయవంతంగా ఓ చోటకు చేరుస్తుంది. మనిషి వీటి నుంచి తనని తాను తెల్సుకుని అందాన్ని ప్రేమించాలి.. ఉద్వేగాలకు అతీతంగా ఓ మనిషిని గుర్తించాలి. అప్పుడు ప్రేమ అందంగా కాదు అర్థవంతం అయి ఉంటుంది.
ఇన్నాళ్లూ ఉన్నవన్నీ వస్తు సంబంధ భావోద్వేగాలు అని అనుకోవాలి.వస్తు సంబంధ ప్రేమల గురించి కూడా అనుకోవాలి. మనుషులంతా ఈక్షణాన వస్తువులు.తరువాత భూమిలో చేరుకునే అస్తికలు. అంటే ఎముకల గూడు మనిషి అని చెప్పాలి. కనుక ప్రేమ త్యాగం అన్నవి పెద్దగా పట్టింపు లేని పదాలు. మనుషుల్లో త్యాగం మోతాదు పెరిగితే కొన్నిసార్లు ఆ భావోద్వేగాల సరళి కట్టడికి నోచుకోదు. త్యాగం కారణంగా ఆనందం కన్నా దుఃఖం ఎక్కువ. అన్ని త్యాగాలు అవసరాలకు నిర్దేశితాలు కావొచ్చు. ప్రేమ కూడా త్యాగం నుంచి పుట్టిందా? లేదా అవసరం నుంచి పుట్టిందా?
ప్రేమ మరియు విరహం మనుషుల్లో చచ్చేంత వరకూ ఉండవు.ఉండాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను! ఏ భావం అయినా ఎక్కడో ఓ చోట ఆగి,అక్కడి నుంచి కొత్త ప్రయాణం ఒకటి అందుకోవాలి. మాటలతో చెప్పేవి మౌనంతో వినిపింపజేసేవి కొన్నే జీవిత కాలాన హాయిగా ఉంటాయి. మనుషుల హృదయాలకు ఉన్నగాయాలన్నీ కారణాలను తుడిచేసేవే! కారణం ఏమయినా కూడా ఓ చోట ప్రతిధ్వనింప జేసే భావోద్వేగం వెల్లువలో ఉంటే కొన్ని గాయాలకు పరిష్కారం దొరకుతుంది. ప్రతిఘటన లేదా ప్రతిధ్వని కొన్నిసార్లు మనుషుల్లో మొండితనం పెంచి వెళ్తాయి.
– రత్నకిశోర్ శంభుమహంతి
– బ్యూటీ స్పీక్స్ – మన లోకం ప్రత్యేకం