ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి తెలంగాణ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మండే ఎండలో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఒకవేళ వెళ్లినా.. మంచినీరు, జ్యూస్లు, శీతలపానీయాలతో కాలం గడిపేస్తున్నారు. ఎండల ప్రతాపంతో మహానగరం హైదరాబాద్లో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి.
ఏప్రిల్‌లో 17 రోజుల్లోనే నగరవాసులు దాదాపు 1.01 కోట్ల బీర్లు తాగేశారు. ఆబ్కారీ శాఖ లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 8,46,175 కేస్‌ల (ఒక కేస్‌లో 12 బీర్లు ఉంటాయి) బీర్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో విక్రయాలు నమోదవుతున్నాయి.
నెలకు సగటున లక్ష చొప్పున బీరు కేసుల విక్రయాలు అధికంగా నమోదవ్వడం గమనార్హం. సాధారణంగా విస్కీ, బ్రాంది తదితర అలవాటున్న వ్యక్తులు సైతం ఎండల ప్రతాపంతో బీరు వైపు చూస్తున్నారు. ఆబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌లో గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో రోజూ సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి.