రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాధి నేతల మధ్య చిత్రమైన రాజకీయం కనిపిస్తోంది. ఇరువురు సీఎంలు నీళ్ల విషయంలో గలాటా చేసుకుంటున్నారు. ఇక, జీఎస్టీ పరిహారంపై కేంద్రం అనుసరిస్తున్న విషయంలో మనసులో ఆక్రోశంతో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. కట్టలు తెగే కోపంతో ఉన్నారు. పైగా అటు కాళేశ్వరం ప్రాజెక్టను నిలిపివేసేలా కేంద్రం వ్యవహరించాలని చూస్తోందని వార్తలు వస్తుండడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ లోలోనే తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు, జీఎస్టీ పరిహారం ఇవ్వకుండా తమను అప్పులు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడంపైనా ఆయన ఫైర్ అవుతున్నారు.
ఇక, ఏపీ సీఎం జగన్ కూడా కేంద్రంపై మనసులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలిని రద్దు చేయాలని కోరారు. అయినా కేంద్రం ఇప్పటి వరకు సానుకూలంగా స్పందించలేదు. పోనీ.. తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించి.. తమ పరువు తీసేస్తున్న ఎంపీ రఘురామ రాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. దీనిపైనా ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా.. ఆయనకు ఏకంగా వై కేటగిరీ భద్రతను ఇచ్చింది. ఇక, ప్రత్యేక హోదా విషయంలో పీకల్లోతు ఆగ్రహం ఉంది. పోలవరం నిధులు ఇవ్వకపోవడంపైనా ఆవేశం, ఆవేదన రెండూ ఉన్నాయి. అదే సమయంలో ఇతర బీజేపీయేతర రాష్ట్రాల మాదిరిగానే జీఎస్టీ విషయంలోనూ అప్పులు చేసుకోవాలని సూచించడంపైనా తీవ్ర కోపం ఉంది.
ఇంత ఆవేదన, బాధ, ఆగ్రహం.. ఆక్రోశం ఉన్నప్పటికీ.. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీపై ఒక్క మాటంటే ఒక్క మాట అనడం లేదు. అంతేకాదు, తమ పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా విమర్శలు చేయరాదని ఇటీవల హుకుం జారీ చేశారు. అదే సమయంలో బీజేపీని కూడా విమర్శించరాదని అనధికార ఉత్తర్వులు వంటివి పార్టీకి జారీ చేశారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది. మరి దీనికి కారణం ఏంటి ? పైగా తెలంగాణ కంటే కూడా ఏపీ .. కేంద్రానికి చాలా అనుకూలంగా ఉంది. అడిగిన వెంటనే మోడీ అనుకూలురుకి రాజ్యసభ సభ్యత్వాలను ఇస్తున్నారన్న టాక్ ఉంది.
అదేవిధంగా కేంద్రం తీసుకువస్తున్న అన్ని బిల్లులకు ముందు వెనుక కూడా ఆలోచించకుండా జైకొడుతున్నారు. అయినా కూడా కేంద్రం సహకరించడం లేదని జగన్ ఆవేదనతో ఉన్నారు. కానీ, పన్నెత్తు మాట కూడా అనకపోవడం గమనార్హం. మరి దీని వెనుక ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాస్తున్నది ఏంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు పరిశీలకులు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.