కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశం ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు.
దేశంలో కరోనా కేసుల నమోదు సంఖ్యలో రాష్ట్రం ముందుందని ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రెండో విడత కరోనా తట్టుకనే శక్తి రాష్ట్రానికి లేదని అన్నారు. కరోనా రెండో వేవ్ సునామీలా విరుచుకుపడే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా రెండో లాక్డౌన్ గురించి సూచనలు చేశారు. గడిచిన పండుగ సీజన్‌లో ప్రజలు సంయమనం పాటించడం వల్లే కరోనా నియంత్రణ సాధ్యమైందన్నారు. అయినా, ప్రజలు భద్రతా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
వీడియోలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. “మనకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ వ్యాధికి చికిత్స లేదు. అందుకే మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం వహిస్తే మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశం ఉంది. మనకు మరో లాక్డౌన్ వద్దు. ఈ ఏడాది లాక్డౌన్లతోనే గడిపేయాలనుకోవట్లేదు. ముప్పు ఇంకా తొలగిపోలేదు. దీపావళి సమయంలో టపాసులు పేల్చొద్దన్న నా విజ్ఞప్తిని అందరూ మన్నించారు. పండుగల వేళ సంయమనం పాటించాలి. కోవిడ్ ఇక అయిపోయిందని ఎవరూ అనుకోవద్దు.” అని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు.
ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఠాక్రేతోపాటు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్.. ప్రజలకు సూచించారు. మాస్కులు, భౌతిక దూరం, పరిశుభ్రత వంటి నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల కేసులు నమోదైనా.. ప్రస్తుతం 82 వేల మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 5,753 కేసులు వెలుగుచూడగా.. 4,060 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నాని ఆయన పేర్కొన్నారు.