టిఆర్ఎస్, బిజెపి పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. మునుగోడు లో జరుగుతున్న తీరుపై వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించారు. మునుగోడు ఎన్నికల్లో టీఆరెస్, బీజేపీ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాయని మండిపడ్డారు. అధికారం తో సంపాదించిన కోట్ల రూపాయలు ఓట్లను కొనడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
ఓట్ల కోసం మంత్రి మల్లారెడ్డి 12 లక్షలు ఇస్తానని చెప్పి 2 లక్షలు ఇచ్చి.. ఇంకా 10 లక్షలు ఇవ్వకపోతే ఆ గ్రామ ప్రజలు అడ్డుకున్నారని అన్నారు. బాధ్యత కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా స్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకత్వం, కేంద్రం నుండి మంత్రులు కోట్ల రూపాయలతో మునుగోడు లో దిగుతున్నారని ఆరోపించారు. మిడతల లాగా మునుగోడు పై దాడి చేసి కోట్లు పోసి ఓట్లు కొంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీ, టీఆరెస్ లు విలువకట్టలేని ఓటును ఇష్టా రాజ్యనా డబ్బులతో ఓట్లు కొంటున్నారని అన్నారు. మునుగోడు ని కొనుగోలు చేస్తామంటే మునుగోడు ప్రజలను అవమానపరిచినట్టేనన్నారు. టీఆరెస్, బీజేపీ పైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లను కొనుగోలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.