మొగులయ్య : పద్మ పురస్కారంతో పేదరికం తీరిపోతుందా?

-

పాట వింటూ పోతుంటే త‌త్వం ఏదో ప‌ల‌కరిస్తుంది. న‌ల్ల‌మ‌ల అడవుల్లో ఉండే త‌త్వం ఒక‌టి వినిపించి వెళ్తుంది.ప‌ల‌క‌రించి వెళ్తుంది.అర్థ‌వంతం అయిన పాట‌లు కొన్నే ఉన్నాయి.వాటికి విస్తృతి లేదు.వాటికి విఖ్యాతి కూడా లేదు.విఖ్యాతి ద‌క్కించాల్సిన ప్ర‌జ‌లకు అవి ప‌ట్ట‌డం లేదు.మొగుల‌య్య‌కు ప‌ద్మ అవార్డు వ‌చ్చింది అని రాసిన మీడియాలో ఆయ‌న పాట‌లు కొన్ని ప్ర‌సారితం అవుతాయి.చెప్పినోడు,రాసినోడు ఆయ‌న క‌ష్టం మాత్రం తీరుస్త‌లేడు అన్న బాధ ఒక్క‌టే ఇవాళ మొగుల‌య్యను అభిమానించే వారిలో!

తెలంగాణ దారుల్లో మొగుల‌య్య అనే పెద్ద క‌ళాకారుడు ఉంటాడు.. ఉన్నాడు.. ఆయ‌న కు ఓపెద్ద కుటుంబం ఉంది.ఆ కుటుంబంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి.మొగుల‌య్య కొడుకుకు మూర్ఛ వ్యాధి. ప‌నికి వెళ్ల‌లేడు. నెల‌కు నాలుగు వేల రూపాయ‌లు మందుల‌కే ఖ‌ర్చు అవుతాయి..మొగుల‌య్య ఆ డ‌బ్బు ఎలానో స‌ర్దుతాడు. చాలీచాల‌ని ఇంటిలో చాలీచాల‌ని జీవితాన్ని కొన‌సాగిస్తాడు.మొగుల‌య్య‌కు ఓ ప‌క్కా ఇల్లు ఇవ్వండి కేసీఆర్.. అని అభ్య‌ర్థించాలి మ‌నం. మొగుల‌య్య పాట‌ను మీరు రికార్డు చేయండి కేసీఆర్..అని అభ్య‌ర్థించాలి మ‌నం.మొగుల‌య్యం ఆఖరి త‌రం క‌ళాకారుడు కిన్నెర వాద్య క‌ళాకారుల్లో ఆఖ‌రితరం.. ఆయ‌న త‌రువాత ఆ 12 మెట్ల కిన్నెరను వాయించే మొగోడు లేడు..మొన‌గాడూ లేడు.అంతటి ప్ర‌త్యేక వాద్యం త‌రువాత కాలంలో ఏ మ్యూజియంలో ఉండిపోనుందో!

కిన్నెర వాద్య గానం చేస్తాడు మొగుల‌య్య..12 మెట్ల కిన్నెర వాద్యాన్ని మీటుతా గానం చేస్తాడు మొగుల‌య్య.సంత‌ల్లో పాట‌లు పాడుకుంటూ త‌న జీవితాన్ని విస్తృతం చేస్తాడు మొగుల‌య్య.సంత‌ల్లో ఇచ్చే బియ్యం,కూర‌లు ఇంటికి ఇచ్చి ఆ వేళ త‌న సంతృప్తిక‌ర జీవితాన్ని ఏ విధంగా ఆరంభించాడో ఆ విధంగానే ముగిస్తాడు మొగుల‌య్య.ఎక్క‌డా చేయి చాచ‌డు.ఎవ్వ‌రినీ ప్ర‌శ్నించ‌డు.ఉన్నంత‌లో త‌న పాట‌కు,ఉన్నంత వ‌ర‌కూ త‌న పాట‌కు న్యాయం చేయాల‌న్న త‌ప‌న‌తో మొగుల‌య్య జీవితాన్ని నిర్వ‌హిస్తాడు.

మొగుల‌య్య‌కు ప‌ద్మ పుర‌స్కారం వ‌చ్చింది.ఊరంతా సంతోషాలు చిందిస్తుంది.న‌వ్వులు చిందిస్తుంది.మొగుల‌య్య కూడా న‌వ్వుతున్నాడు.ప‌ద్మ పుర‌స్కారం తో ఆయ‌న పేద‌రికం ఏమౌతుంది. ప‌ది మంది కుటుంబంతో రేకుల ఇంటిలో జీవనం సాగించే మొగుల‌య్య కు రేప‌టి నుంచి ప‌క్కాగా అన్నీ కుదిరిపోతాయా? ఆహా! ఆయ‌న సంత‌ల్లోకి వెళ్ల‌కుండా పాటలు పాడ‌కుండా ఉండ‌లేడు క‌దా! ఉండాల‌న్నా ఆ ఇంటి మ‌నుషుల ఆక‌లి ఉండ‌నివ్వ‌దు క‌దా! మొగుల‌య్య కొన్ని క‌న్నీళ్ల‌ను మోస్తున్నాడు. ఆ విధంగా మొగుల‌య్య‌కు అవి అల‌వాటు అయి ఉన్నాయి.మొగుల‌య్య కొంద‌రి జీవితాల‌ను గానం చేస్తున్నాడు..ఆ విధంగా మొగుల‌య్య అర్థ‌వంతం అయి ఉన్నాడు.క‌ళ‌కు అర్థం ఉంది. జీవితానికే ఇంకా విషాదం ఒక‌టి వ‌ద‌ల‌న‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news