దేశ తొలి సీడీఎస్, త్రివిధ దళపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశాన్ని శోఖసంద్రంలో ముంచింది. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే వ్యక్తి మరణించడంతో యావత్ దేశం కంటతడి పెట్టింది. తమిళనాడులో నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీహెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్, మరో 11 మంది దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం రావత్ మరణంపై అనుచిత పోస్టులు పెడుతున్నారు. రావత్ మరణాన్ని అవమాన పరిచేలా పోస్టులు పెట్టిన వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 21 ఏళ్ల నిందితుడు జావేద్ ఖాన్ రాజస్థాన్‌లోని నాజర్‌బాగ్ నివాసి. అతన్ని పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు టోంక్ ఎస్‌హెచ్‌ఓ కొత్వాలి పోలీస్ స్టేషన్ జితేంద్ర సింగ్ తెలిపారు. సోషల్ మీడియాలో జనరల్ బిపిన్ రావత్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఖాన్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఆదేశించాడు.
అంతకుముందు ఇదే విధంగా గుజరాత్ కు చెందిన 44 ఏళ్ల వ్యక్తి కూడా ఇలానే అనుచిత పోస్టు పెట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు శివభాయ్ రామ్‌గా గుర్తించబడ్డాడు, అతను గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా రాజులా తాలూకాలోని భేరాయ్ గ్రామ నివాసి అని పోలీసులు నిర్థారించారు