కృష్ణా నది ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరోసారి కృష్ణ నదికి వరద పోటెత్తుతోంది. కర్ణాటకలోని పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు 4 గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.శ్రీశైలంతో పాటు సాగర్ అటవీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో సాగర్ డ్యాం పూర్తి స్థాయిలో నిండుకుంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 18 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుంది. ఆదివారం ఉదయం ఆ ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తిన అధికారులు లక్షా 72 వేల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు.