జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో.. మహిళను ఈడ్చి పడేశారు

-

విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో దారుణం జరిగింది. అభివృద్ధి పనులపై ప్రశ్నించిన 48వ వార్డు కార్పొరేటర్‌, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ గంకల కవితను మేయరు సస్పెండ్‌ చేశారు. ఆమెను మార్షల్స్‌ ఈడ్చుకెళ్లి బయట పడేశారు. శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం జీరో అవర్‌లో చర్చ సందర్భంగా మేయరు హరి వెంకటకుమారి.. కవితకు మాట్లాడే అవకాశమిచ్చారు. ‘కౌన్సిల్‌ ఏర్పాటై ఏడాదిన్నరైంది. ఏడాది క్రితం 48వ వార్డుకు రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు కేటాయిస్తూ తీర్మానం చేశారు. ఒక్కపనీ ప్రారంభించలేదు. ప్రజలసొమ్ము తింటూ ఇంజినీరింగ్‌ అధికారులు అన్యాయం చేస్తున్నారు. వారు పురుగులు పడి పోతారు’ అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులను అలా అంటారా.. వెంటనే కవిత క్షమాపణలు చెప్పాలంటూ అధికార వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. తన వార్డులో పనులు చేస్తే క్షమాపణ చెబుతానని కవిత స్పష్టంచేశారు. క్షమాపణ చెప్పేదాకా ఆమె వార్డులో ఒక్కపనీ చేయకుండా ఆదేశాలివ్వాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు మేయరును కోరారు. దీంతో కవిత పోడియం వద్ద బైఠాయించారు. కవితను మేయరు సస్పెండ్‌ చేయడంతోపాటు సమావేశ మందిరం నుంచి బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌ను ఆదేశించారు. ఆమెను మార్షల్స్‌ బయటకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో కవిత స్పృహ తప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news