వరంగల్‌లో బీజేపీ నేత ఆత్మహత్య.. మోసపోయానంటూ..

-

అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక వరంగల్‌లో ఓ బీజేపీ నాయకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ ఎనుమాముల బాలాజీనగర్‌కు చెందిన గంధం కుమారస్వామి(45) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత నగరపాలక సంస్థ(వరంగల్‌) ఎన్నికల సమయంలో కార్పొరేటర్‌ టికెట్‌ రాకపోవడంతో తెరాసను వీడి బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు.

ఎన్నికల సమయంలో ఎనుమాముల మాజీ సర్పంచి సాంబేశ్వర్‌ నుంచి రూ.25 లక్షలు తీసుకున్నానని, ఓటమి పాలైన తనను ఓ వైపు ఆ బాధ కుంగదీస్తుంటే మరోవైపు మాజీ సర్పంచి డబ్బుల కోసం వేధించాడని సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందారు. ఆయన ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, నమ్మినవారు తనను మోసం చేశారని విలపించారు. తన భార్య, పిల్లలను వేధించవద్దంటూ లేఖ రాశారు. వీడియోను మిత్రులకు, తోటి వ్యాపారులకు పంపించి ఇంట్లో ఉరేసుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య మరో గదిలో ఉన్నారు. అనంతరం కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news