కర్ణాటకతో కలిసి ఎన్నికలు జరగాలని బీఆర్ఎస్ కు కోరిక ఉన్నా.. ఎన్నికల కమిషన్ కేసీఆర్ జేబు సంస్థ కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కిసాన్ సర్కారు అంటూ బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలు.. దేశ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని చెప్పారు. బీఆర్ఎస్ ది పరివార్ సర్కారు అని అవినీతి, కుంభకోణాల ప్రభుత్వమని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతు రుణమాఫీ, ఉచిత రసాయన ఎరువుల సరఫరా లేదని విమర్శించారు. కీలక వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు తీసుకుంటున్న అనేక సంస్కరణల నేపథ్యంలో అసలైన కిసాన్ సర్కారు మోదీ ప్రభుత్వమని నిరూపించుకుందని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రస్తావిస్తున్న జమిలి ఎన్నికలు జాతీయ పార్టీగా తాము కూడా కోరుకుంటున్నామని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. సాధారణంగా ఉప ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు అనేది ప్రజా ధనం దుర్వినియోగం కాదని తేల్చి చెప్పారు. శాసనసభ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు.