భారత నౌకా దళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’

-

భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు డబుల్ అయ్యాయి. దేశీయంగా తయారు చేసిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నౌకా దళంలో ప్రవేశ పెట్టారు. ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌ను భారత్‌లో తయారైన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఒకటిగా రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. ‘ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన యుద్ధనౌకల్లో ఇది ఒకటి. ఇందులోని వ్యవస్థలు భవిష్యత్తు అవసరాలనూ తీర్చగలవు. మన స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో.. ఇతర దేశాలకూ నౌకానిర్మాణాలు చేసిపెడతాం’ అని అన్నారు.

ఈ యుద్ధనౌక పొడవు 163 మీటర్లు కాగా, వెడల్పు 17 మీటర్లు. బరువు 7400 టన్నులు. గోవాలోని చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్‌ పేరిట నామకరణం చేశారు. అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు. భారత నౌకాదళం ‘వార్‌షిప్ డిజైన్ బ్యూరో’ దేశీయంగా రూపొందించిన నాలుగు ‘విశాఖపట్నం’ క్లాస్ డెస్ట్రాయర్‌లలో ఇది రెండోది. ఈ యుద్ధనౌకను మజగావ్‌ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది.

నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్‌లతో నడిచే ఈ యుద్ధనౌక గంటకు 30 నాట్‌లకు పైగా వేగాన్ని అందుకోగలదు. ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌లో అధునాతన ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఆధునిక నిఘా రాడార్‌తోపాటు ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు ప్రయోగించవచ్చు. పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తి పొంది 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. గత ఏడాది డిసెంబర్ 19న ఈ యుద్ధనౌక మొదటిసారి జలప్రవేశం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news