ఓట్ల కోసం టీఆర్ఎస్ ప్రకటించిన అనేక పథకాలు అమలుకు నోచుకోవడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. భూదందా, ఇసుక దందా తదితర అంశాల నుంచి ప్రజలను తప్పుదారి పట్టించడానికి జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం ఒకేవిధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సెప్టెంబర్ 17 ప్రధాని మోదీ పుట్టిన రోజు నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు హాలియాలో ఆయన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
మునుగోడు ఉప ఎన్నిక అవినీతికి, ధర్మానికి మధ్య జరిగే ఎన్నిక అని, అందులో బీజేపీ గెలుపు తథ్యమని లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల్లో గెలవడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం కంటే ప్రజలకు సేవ చేయడమే బీజేపీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేస్తోందని విమర్శించారు. ఆయుష్‌మాన్ భారత్ పేరుతో కేంద్రం ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని తెస్తే తెలంగాణలో కేసీఆర్ ఆ పథకాన్ని అమలుచేయకుండా తాత్సారం చేశారని అన్నారు.