ఏపీ బీజేపీలో ఏం జరుగుతుంది..కీలక విషయాల్లో క్లారిటీ మిస్సవుతోందా..పొంతనలేని ప్రకటనలతో నాయకులే పార్టీని డిఫెన్సులో పడేస్తున్నారా..మేమే ప్రత్యామ్నాయం అంటున్న పార్టీకి రోజుకో ఎదురుదెబ్బ తగులుతోందా ఏపీ విషయంలో బీజేపీ క్లారిటీతో ఉందా లేక కన్‌ఫ్యూజన్‌లో ఉందా అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిరేపుతుంది.
ఏపీ బీజేపీ ఏదో అనుకుంటే.. ఏదేదో అవుతోంది. పక్క పార్టీలు, ప్రత్యర్థులకంటే. ఆ పార్టీని.. సొంతపార్టీ నేతలే ఇరకాటంలో పడేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వేస్తున్న అడుగులు.. రాష్ట్ర బీజేపీని డిఫెన్స్ లోపడేశాయి. పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ అమోదంతో ఇక్కడ వేడి మొదలైంది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్‌ను మరచిపోయి కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడుతున్నాయి.వైసీపీ, టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు.. అంతా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. దీంతో బీజేపీ నేతలు డిఫెన్స్‌లో పడ్డారు
ఇక్కడి ప్రజల సెంటిమెంట్‌ను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతాం అంటూ బిజెపి నేతలు ఎన్ని వాగ్దానాలు చేస్తున్నా..అందరి వేలు మాత్రం వారివైపే ఉంటోంది. ఇప్పటికే ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, పోలవరం నిధుల అంశాలపై బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే ఇప్పటివరకు కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపించడంలేదు.
ఈ విషయంలో కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేసినా.. ఏపీ బీజేపీ నేతలు డిఫెన్స్‌లో పడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలు కార్మిక సంఘాలకు మరింత ఆగ్రహం తెప్పించాయి. దీంతో గతంలో ప్లాంట్ ను తామే కాపాడాం అంటూ బిజెపి చెపుతున్న మాటలు కూడా జనంలోకి వెళ్లడం లేదు. స్టీల్ ప్లాంట్ తో పాటు రైల్వే జోన్ వంటి అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
కేంద్రంలో పవర్‌ఫుల్‌గా ఉన్న బీజేపీ.. ఏపీలో బలపడాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రత్యేక హోదా నుంచి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వరకూ అన్ని అంశాలు కమలంనేతలకు కలిసిరావడంలేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం మొండిగా ముందుకు వెళ్తే.. ఉత్తరాంధ్రలో బలపడాలనే బీజేపీ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఒకవైపు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ బీజేపీ నేతలకు మైనస్‌గా మారితే.. మరోవైపు ఇక్కడి నేతల వైఖరి కూడా ప్రజలకు అంతుచిక్కడంలేదు.