ఎవరూ గొంతెత్తకూడదా ? సోము నిర్ణయంతో వారికి రగిలిపోతోంది ?

-

ఈ మధ్యకాలంలో ఏపీ బిజెపిలో వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్తగా ఏపీ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు పార్టీలో తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. బిజెపి అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. నేతలు ఎవరు తమ ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదని, ఇక్కడ క్రమ శిక్షణ ముఖ్యం అనే సంకేతాలను పార్టీలో ఇచ్చి, నిజమైన బిజెపి భక్తులే పార్టీలో ఉండాలని, వారితోనే అధికారం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంతో పార్టీలోనే ఉంటూ, టిడిపి, వైసీపీ లకు మద్దతు గా మాట్లాడుతున్న వారిపై వేటు వేసేందుకు వెనక ముందు ఆడడం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులను సస్పెండ్ చేసిన ఆయన, ఇక పైన ఎవరైనా ఆ విధంగా వ్యవహరిస్తే, వారిపైన వేటు వేసేందుకు వెనకాడబోమని, వారి పైన వేటు వేసేందుకు వెనకాడబోమనే సందేశాన్ని పార్టీ నాయకులకు ఇస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, టీవీ డిబేట్ లలో పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ, ప్రత్యర్థులకు ధీటుగా సమాధానాలు చెబుతూ వస్తున్న కొంతమంది పార్టీ సీనియర్ నాయకులకు ఇప్పుడు సోము వీర్రాజు కొన్ని ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదం అవుతోందట. ఇకపై బిజెపి తరఫున ఎవరు ఎక్కడ ఏ విషయంపైన అయినా మాట్లాడడానికి వీలు లేదని, ఎవరైనా అలా మాట్లాడాలి అనుకుంటే, ముందుగా వారు తాము మాట్లాడాలని అనుకుంటున్న విషయాన్ని తనకు తెలియజేయాలని, ఆ తరువాత తన అనుమతితోనే మాట్లాడాలంటూ కొత్తగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై చాలామంది బిజెపి సీనియర్ నాయకులు మండిపడుతున్నారు.

తమకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారని, ఇలా  అయితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిజెపి పరిస్థితి ఏపీలో అంతంతమాత్రంగానే ఉంది. కాస్తోకూస్తో ఈమధ్య బలం పెంచుకుంటుంది అని అనుకుంటున్న సమయంలో, నాయకులను ఇలా గొంతు ఎత్తకుండా చేయడం ద్వారా వారిలో నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నాయని, ఫలితంగా కొత్తగా బిజెపిలో చేరేందుకు ఎవరూ ముందుకు రారు అని, కాబట్టి పార్టీ విధించిన నియమ నిబంధనలు సడలింపు ఇవ్వాలి అంటూ వారు సూచిస్తున్నారు. అయినా సోము వీర్రాజు మాత్రం ఎవరి మాట వినేలా కనిపించకపోవడంతో, ఆ పార్టీ నాయకుల్లో అసంతృప్తి కలుగుతున్నట్లు తెలుస్తోంది.వీర్రాజు మాత్రం తన చర్య సరైనదే అని, క్రమశిక్షణ అనేది లేకపోతే పార్టీ విజయం అనేది సాధ్యమే కాదు అనే అభిప్రాయంతో ఉండడంతో, తాను అనుకున్న విధంగానే ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news