కమలం టార్గెట్: తెలంగాణలో కాంగ్రెస్…ఏపీలో టీడీపీ!

-

కేంద్రంలో రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ… దేశంలో అన్నీ రాష్ట్రాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండేళ్లలో కమలానికి ఏది అనుకూలంగా జరగడం లేదు. ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కమలానికి భారీ షాకులే తగిలాయి. ఆ పార్టీ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఘోరంగా ఓడింది. అయినా సరే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో తన రాజకీయాలని ఆపడం లేదు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీ చాలావరకు బలపడింది. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తయారైంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వీక్ కావడంతో, ఆ స్థానంలోకి బీజేపీ వస్తుంది. అలాగే ఇతర పార్టీలకు చెందిన నాయకులని వరుసపెట్టి పార్టీలోకి తీసుకొస్తుంది.

ఇక దుబ్బాక ఉపఎన్నిక, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటిన కమలం, నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్‌ని గద్దె దించడం ఖాయమని చెబుతుంది. నాగార్జునసాగర్‌లో ఓడినా సరే తాజాగా ఈటల రాజేందర్‌ ని పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు చెక్ పెడతామని అంటుంది. పైగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలు సైతం కమలానికి కలిసొస్తున్నాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్లేస్‌లో కమలం వచ్చేసింది. అలాగే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తయారైంది.

తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ని బీజేపీ రీప్లేస్ చేసిందిగానీ, ఏపీలో మాత్రం ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని బీజేపీ రీప్లేస్ చేయలేకపోయింది. 2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఒక్కశాతం కూడా ఓట్లు రాలేదు. అయినా సరే మొదట్లో వరుసపెట్టి టీడీపీ నేతలకు కాషాయ కండువా కప్పారు. ఇక అప్పుడే ఏపీలో టీడీపీ పని అయిపోయిందని, జగన్‌కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు హడావిడి చేసేశారు. అసలైన ప్రతిపక్షం తామే అని, జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టి అధికారంలోకి వచ్చేస్తామని చెప్పుకుంటూ వచ్చింది.

కానీ ఏపీలో వాస్తవ పరిస్తితులు అలా లేవు. ఇక్కడ అధికార వైసీపీ బాగా బలంగా ఉంది. అదే సమయంలో టీడీపీ ఓటు బ్యాంక్ బలంగానే ఉంది. ఇప్పటికీ వైసీపీకి టీడీపీనే ప్రత్యామ్నాయంగా ఉంది. ఆఖరికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు ఓట్లు తగ్గాయని, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు నిరూపించాయి. కాబట్టి ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ స్థానంలోకి బీజేపీ రాగలిగింది గానీ,  ఏపీలో టీడీపీ స్థానంలోకి బీజేపీ రాలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news