BREAKING: వరంగల్ లో బిజెపి సభకు హైకోర్టు అనుమతి

-

బిజెపి మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభకు గ్రౌండ్ ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేతలు చెల్లించిన రెంటును కూడా వెనక్కు ఇచ్చేశారు. అయితే ఈ ఇష్యు పై ఆగ్రహం వ్యక్తం చేసిన కమలం శ్రేణులు.. ఇవాళ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.

ఈనెల 27న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో బిజెపి భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అయితే ఈ సభకు పోలీసు అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. పోలీసుల పర్మిషన్ లేనందున తాము కూడా సభకు కాలేజీ గ్రౌండ్ ఇవ్వలేమని లెటర్ విడుదల చేసింది యాజమాన్యం.

అయితే ఇప్పటికే పోలీసులు అడ్డుకోవడంతో వాయిదా పడిన ప్రజా సంగ్రామ యాత్ర కు అనుమతి నిరాకరణ పై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది బిజెపి. విచారణ సందర్భంగా హనుమకొండ కాలేజీ గ్రౌండ్ కి ఒకే ప్రవేశద్వారం ఉందని.. ఇలాంటి ప్రదేశంలో భారీ బహిరంగ సభకు అనుమతి ఇస్తే ప్రమాదమని ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలిపారు.

అయితే హనుమకొండ కళాశాలలో సభ ఏర్పాటు చేస్తున్న వాళ్ళం తామే తొలి వాళ్ళం కాదని.. చాలా పార్టీల వాళ్లు, చాలా సార్లు, అక్కడే సభలు, సమావేశాలు నిర్వహించుకున్నారని బిజెపి తరఫు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. రేపటి వరంగల్ బిజెపి సభకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news