హవాలా కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ (ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీతో మనీలాండరింగ్ కేసులో సోమవారం అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 2015-16 సంవత్సరంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన షెల్ కంపెనీల నుంచి రూ.4.81 కోట్లు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ మేరకు సీబీఐ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ప్రకారం దర్యాప్తు ప్రారంభించామన్నారు.
ఈ క్రమంలోనే రెండు నెలల కిందట సత్యేందర్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ.. తాజాగా ఆయనను అరెస్ట్ చేసింది. కాగా, మంత్రి సత్యేందర్‌ను అరెస్ట్ చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జనవరి నెలలోనే తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. మంత్రి సత్యేంద్ర జైన్‌పై 8 ఏళ్లుగా ఫేక్ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జ్ గా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.