వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా లింగగిరి క్రాస్ రోడ్స్ దగ్గర ఆమెను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. టిఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల గోబ్యాక్ అంటూ ఆందోళన చేయడంతో టిఆర్ఎస్, వైయస్సార్ టిపి కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక పాదయాత్రలో తీవ్ర ఉధృత పరిస్థితులు తలెత్తడంతో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని లింగగిరి వద్ద పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. దీంతో పోలీసులు, వైఎస్ఆర్ టిపి కార్యకర్తల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. అయితే నిన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నేడు ఉదయం నుంచి ఆమె పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు టిఆర్ఎస్ కార్యకర్తలు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు.