తెలంగాణ బీజేపీ సారథిగా పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ తన మాటలు,చేతలతో పార్టీని పరిగెత్తించారు. కానీ పార్టీ విస్తరణ కమిటీల ఏర్పాటులో మాత్రం డిఫెన్స్ లో పడ్డారు. అటో ఇటో రాష్ట్ర కమిటీ ఏర్పాటు అయిందనిపించినా మిగితా కమిటీలను అలాగే వదిలేశారు. ఇక జిల్లాల్లో ఇంఛార్జుల నియామకంలో అదే నాన్చుడు ధోరణి..సంస్థగతంగా బలపడ్డ టీఆర్ఎస్,కాంగ్రెస్ ని ఢీకొనాలంటే పార్టీ విస్తరణ ముఖ్యం కానీ ఆ విషయంలో కాషాయ దళపతి ఎందుకు ఆసక్తి చూపడం లేదన్నది సొంత పార్టీలోనే కొత్త చర్చకు దారి తీస్తుంది.
గత ఏడాది మార్చిలో తెలంగాణ బీజేపీ సారథిగా వచ్చారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తర్వాత రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు చాలా సమయం పట్టింది. కిందటి సంవత్సరం సెప్టెంబర్‌లో రాష్ట్ర పదాధికారులను, వివిధ మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించారు. ఆ తర్వాత ఎందుకో మిగతా కమిటీల కూర్పు ఆగిపోయింది. పార్టీ పదవులు కోసం ఎదురు చూసేవారు ఎదురు చూస్తున్నారు.. ఆ పదవుల నియామక చేపట్టాల్సిన వారు ఇదిగో అదిగో అని కాలయాపన చేస్తూనే ఉన్నారు.
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా కమిటీల ఏర్పాటు.. సంస్థాగత నియామకాలు జనవరి 15లోపే పూర్తి కావాలని కేంద్ర పార్టీ ఆదేశించినా అదే నిర్లక్ష్యం..సంస్థాగత కూర్పు కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో బలపడాలని అనుకుంటున్న సమయంలో ఇలా ఉదాసీనంగా ఉంటే ఎట్లా అని నాయకులు నిలదీస్తున్నారట. రాష్ట్ర పదాధికారులకు కూడా ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని ఇంఛార్జ్ చెప్పడంతో అలా కొందరి పేర్లు ప్రకటించారు. మిగతా వారికి ఏ పనీ లేదట. ఏదో ఒక పని అప్పగిస్తే జనాల్లోకి వెళ్తాం కదా పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.
ఇక జిల్లాల విషయానికి వస్తే ఇబ్బందులు ఉన్న జిల్లాలను పక్కన పెట్టి.. మిగతా జిల్లాలకు ఇంఛార్జులను వేయొచ్చు కదా అన్నది బీజేపీలో వినిపించే మాట. దానిపై కూడా దృష్టి పెట్టే పరిస్థితి లేదట. రాష్ట్ర కమిటీ కొత్తగా వచ్చినా.. జిల్లాలకు మాత్రం పాతవారే ఇంఛార్జులగా కొనసాగుతున్న దుస్థితి. పాత ఇంఛార్జుల్లో కూడా కొందరు మనకెందుకు వచ్చిందిలే అని డిశ్చార్జ్ అయిపోయారట. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసేవాళ్లు కరువయ్యారనే చర్చ జరుగుతోంది.
సంస్థాగత కూర్పులపై ఢిల్లీ నుంచి తరచు ప్రశ్నిస్తున్నా ఇక్కడ మాత్రం ఎలాంటి స్పందన లేదు. చాలా మంది బీజేపీ నేతలు.. తరచు హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌కు వచ్చి తమ పరిస్థితి ఏంటా అని ఆరా తీస్తున్నారట. ఆందోళనలు,ధర్నాలు.. నిరసనలకు పార్టీ పరంగా ఎంతటి ప్రాధాన్యం ఇచ్చినా.. బూత్ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు లేక పోతే అధికారం పై ఆశలు వదులుకోవడమే అన్న చర్చ పార్టీ నేతల్లోనే వినిపిస్తుందట..బండి సంజయ్ పార్టీని ఎలా గాడిన పెడతారో చూడాలి.