విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఉత్పత్తిని తగ్గించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతోందని విమర్శించారు. 24వేల టన్నుల ఉత్పత్తికి గాను కేవలం 15 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని వెల్లడించారు.
అంతర్జాతీయంగా బొగ్గు ధర పడిపోయిందన్నారు. భాజపా ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాసి, ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అనకాపల్లిలో జరిగిన మినీ మహానాడులో, వైకాపా ప్లీనరీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానాలు చేయలేదని రాఘవులు ఆక్షేపించారు.
ప్రతి ప్రాంతానికి ఓ గుర్తింపు ఉంటుందని.. విశాఖ అంటే స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుందని బీవీ రాఘవులు అన్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్‌కు.. కేంద్రం గనులు కేటాయించకుండా ప్రైవేటీకరణ నిర్ణయం సరైంది కాదని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్టీల్ ప్లాంట్‌కు అన్యాయం జరిగిందని ఆక్షేపించారు. ప్రభుత్వం రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు.