ఆంధ్రావని రాజకీయాల్లో మళ్లీ వైసీపీ కాస్త సానుకూల ఫలితాలను అందుకునేలానే ఉంది.నిన్నటి వేళ సినీ పెద్దలతో చర్చలను పురస్కరించుకుని జగన్ నడుచుకున్న తీరు,మాట్లాడిన విధానం అన్నీ ఎంతో హుందాగా ఉన్నాయి.అవే ఇప్పుడు జగన్ కు ప్లస్ కానున్నాయి కూడా! ఎన్నికలకు ఇంకా గడువు ఉంది.దాదాపు రెండేళ్ల దూరంలో ఉన్నారు వైసీపీ పెద్దలు ఈ సమయంలో ఎందుకు వచ్చిన గొడవ అని సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
అదేవిధంగా ఇండస్ట్రీ పెద్దలు చెప్పిన ప్రతి విషయాన్నీ సావధానంగా విన్నారు. సానుకూల నిర్ణయం ఒకటి ఇచ్చి లేదా వెలువరించి పంపారు. ఈ నెల మూడో వారంలో విడుదలయ్యే జీఓ పై ఇప్పటికే కొంత స్పష్టత కూడా వచ్చింది. సవరించిన టికెట్ ధరలు కూడా ఆమోదయోగ్యం గానే ఉన్నాయని మెగాస్టార్ అన్నారు. ఇక ఇప్పుడు పరిశ్రమ పెద్దలంతా జగన్ విషయమై కృతజ్ఞతతో ఉన్నారు.
ఇదే సమయంలో జనసేన తెరపైకి వచ్చింది.తనదైన వాదన ఒకటి వినిపిస్తోంది.సినీ పరిశ్రమ పెద్దలతో చర్చలు జరిపినవిధంగానే రాజధాని రైతులతోనూ,సంబంధిత పెద్దలతోనూ మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి అని జనసేన అంటోంది.ఈ మేరకు నాదెండ్ల మనోహర్ మీడియా ముందుకు వచ్చి విశాఖలో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఇండస్ట్రీ పెద్దలను చర్చలకు ఆహ్వానించిన జగన్ పక్కనే ఉన్న అమరావతి రైతులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు.