కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో కీలక మార్పులు తీసుకువచ్చే విధంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత కార్మిక చట్టాల్లో ఉన్న 8 గంటల పని సమయం 12 గంటలకు పెంచనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతోపాటు మరిన్ని మార్పులు తీసుకురానుంది. జులై 1వ తేదీ నుంచి మొత్తం నాలుగు కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. పెట్టుబడులు, ఉద్యోగావకాశాల పెంపునకే ఈ చట్టాలు తెస్తున్నట్టు పేర్కొంది కేంద్రం.
ఈ చట్టాల ద్వారా వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణ, పని పరిస్థితులు వంటి అంశాల్లో ఆశిస్తున్న సంస్కరణలు సాధించాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టాలు అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న పనిగంటల సమయం 8-9 గంటల నుంచి 12 గంటలకు పెరుగుతుంది. ఓటీ (ఓవర్ టైం) సమయం 50 గంటల నుంచి 150 గంటలకు పెరుగుతుంది. అలాగే, కార్మికుడు, యజమాని జమచేసే భవిష్య నిధి (పీఎఫ్) మొత్తం కూడా పెరుగుతుంది. స్థూల వేతనంలో 50 శాతం మూల వేతనం ఉండాలి. ఫలితంగా భవిష్య నిధికి కార్మికుడు జమచేసే మొత్తం పెరుగుతుంది. యజమానికి అంతే మొత్తం జమచేయాల్సి ఉంటుంది. దీని వల్ల పదవీ విరమణ తర్వాత అందుకునే మొత్తం, గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు సంవత్సరంలో 240 రోజులు పనిచేస్తే ఆర్జిత సెలవులు లభిస్తుండగా, ఇకపై దానిని 180 రోజులకు కుదించనున్నారు. ఇంటి నుంచి పనిచేసే వారికి (వర్క్ ఫ్రం హోం) కూడా చట్టబద్ధత లభించనుంది.