కరోనా వైరస్.. ఇప్పుడు ఎవరి నోట చూసినా ఇదే మాట వినిపిస్తుంది. ఎక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి ప్రపంచదేశాలను అతి తక్కువ పమయంలోనే ఆక్రమించింది. కరోనా దెబ్బకు అగ్ర దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.. చిన్న దేశాలు చితికిపోతున్నాయి.. బలమున్నా, లేకున్నా బలి కావాల్సిందే. పేద.. ధనిక అని తేడా లేకుండా అందరినీ నానా ఇబ్బందులు పెడుతుంది ఈ రక్కసి. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. మరియు మృతుల సంఖ్య 88,403 మందికి చేరింది.
ఇక కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో.. అందరూ నివారణపైనే ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశదేశాలు లాక్‌డౌన్ విధించడంతో పాటు కఠన చర్యలు సైతం తీసుకుంటున్నారు. అయితే దీన్నే అదునుగా చేసుకుని కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువులకు ప్రజల దగ్గర అధిక ధరలు వసూల్ చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1955 నిత్యావసర వస్తువుల చట్టం నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది.
ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. బ్లాక్ మార్కెటింగ్, ధరలు పెంచితే ఏడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. కొన్నిసార్లు అయితే రెండు శిక్షలతో కలిపి శిక్షించవచ్చునని తెలిపారు. కాగా, దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ దృష్ట్యా ప్రజలకు నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.