ఏపీ రాజధాని విషయమై ఇంకా పంచాయితీ కొనసాగుతూనే ఉంది. అసలు ఈ పంచాయితీకి ఎప్పుడు బ్రేక్ పడుతుందో ? కూడా తెలియని పరిస్థితి. మరోవైపు ఈ విషయంపై కోర్టుల్లో వరుసగా ఏదో పిటిషన్లు వేస్తుండడంతో జగన్ ఎంత త్వరగా రాజధానిని వికేంద్రీకరణ చేయాలని ఆశపడుతున్నా ముందుకు సాగడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం చట్టం తేవడంతో పాటు గెజిట్‌ను కూడా ప్రకటించింది. అయితే హైకోర్టు దీనిపై స్టేటస్ కో ఇవ్వడంతో ప్రభుత్వానికి కాస్త షాకే తగిలినట్లయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కేంద్రం మరో అఫిడవిట్ దాఖలు చేసి ఏపీ ప్రభుత్వానికి పెద్ద షాకే ఇచ్చింది. హైకోర్టు ఉన్నంత మాత్రాన దానిని రాజధాని అనలేం అని పేర్కొంది.
ఈ విషయంలో కేంద్రం ముందు నుంచి చెపుతున్నట్టే రాజధాని అనేది రాష్ట్రం ఆధీనంలో ఉండే అంశం.. దానితో కేంద్రానికి సంబంధం ఉండదని చెప్పినా ఇక్కడే అసలు సిసలు సస్పెన్స్ మెయింటైన్ చేసింది. హైకోర్టు ఉన్నంత మాత్రాన దానిని రాజధాని అనలేం అని పేర్కొంది. ఇక రాజధాని ఎక్కడో తేలితే హైకోర్టుపై ఓ క్లారిటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక రాష్ట్ర విభజన జరిగాక కూడా చాలా రోజులకు కాని ఏపీ హైకోర్టు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి రాలేదు. ఇక ఇప్పుడు హైకోర్టు అమరావతికి రావడం.. అక్కడ నుంచే కార్యకలాపాలు నడవడం ప్రారంభమైంది.
ఇప్పుడు జగన్ సర్కార్ రాజధాని వికేంద్రీకరణ పేరిట హైకోర్టును కర్నూలుకు తరలిస్తోంది. కర్నూలు న్యాయ రాజధాని అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది. అయితే ఇదే టైంలో కేంద్రం హైకోర్టు ఉన్నంత మాత్రాన దానిని రాజధాని అని చెప్పలేం అన్నట్టుగా తన తాజా అఫిడవిట్ ద్వారా బట్టబయలు చేసింది. దీనిని బట్టి కేంద్రం తెలివిగా రాజధాని రాష్ట్రం పరిధిలో ఉంటుందని చెపుతూనే హైకోర్టు ఉన్నంత మాత్రాన దానిని రాజధానిగా పేర్కొనలేం అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఇక్కడే మెలిక పెట్టినట్టు తెలుస్తోంది. ఇది జగన్ సర్కార్‌కు పెద్ద షాకే. ఇప్పటికే రాజధానుల అంశం త్వరగా ముగించాలని జగన్ చూస్తుంటే కోర్టులు పదే పదే బ్రేకులు వేస్తున్నాయి. రేపో మాపో కేంద్రం కూడా ఈ విషయానికి బ్రేకులు వేస్తే జగన్ మూడు రాజధానుల కల మరింత ఆలస్యం అవ్వడం ఖాయం.