కరోనా కాలం దాపురించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని పనులు నిలిచిపోయాయి. నలుగురు చేరి కూర్చుని మాట్లాడుకునే రోజులు పోయాయి. ఓ పది మంది చేరి ఏదైనా కార్యక్రమం నిర్వహించే పరిస్థితులు లేకుండా పోయింది. ఎక్కడ విన్నా.. ఎక్కడ కన్నా.. మూతికి మాస్కులు.. మనుషుల మధ్య దూరాలు పెరిగిపోయాయి. ఎక్కడ ఏ రూపంలో ఎలా వైరస్ విజృంభిస్తుందోనన్న భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. ఈ క్రమంలోనే మార్చి, ఏప్రిల్, మే వరకు దేశం మొత్తం లాక్‌డౌన్‌తో స్తంభించి పోయింది. అయితే, ఎన్నాళ్లీలాక్‌డౌన్. ఇది ప్రజలకు ఎలా ఉన్నా.. ప్రభుత్వాలకు మాత్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బంకర పరిస్థితిని పెంచింది. దీంతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే.. అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక, ఎన్నికలు వంటి కీలక ఘట్టాలకు తెరదీస్తే.. భారీ ఎత్తున జనాలు గుమిగూడే అవకాశం ఉందని.. వైరస్ విజృంభిస్తుందని, భారీ ప్రాణనష్టం వస్తుందని భావించి.. ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరి ఇలా ఎన్నాళ్లు? ఇప్పుడున్న ప్రపంచస్థాయి అంచనా మేరకు వచ్చే ఏడాది మే వరకు కూడా కరోనా ప్రభావం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరి అప్పటి వరకు ఎన్ని పనులు ఆపుకుంటారు? ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆరంభంలో మూడు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఆయా ప్రభుత్వాల పదవీకాలం పూర్తవుతోంది.
ఈ క్రమంలో బిహార్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కరోనా నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఎక్కడా లైన్లు లేకుండా ఓటర్లను నిలువరించడం. ప్రతి ఓటరుకు కూడా గ్లౌజులు ఇవ్వడం, మాస్కులు ఇవ్వడం, శానిటైజర్లను అందుబాటులో ఉంచడం, అత్యవసర వైద్యాన్ని అందించడం వంటివి కూడా పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాటు చేసి ఎన్నికల క్రతువును ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక, ఇదే సమయంలో సహజంగానే ఎన్నికలు అంటే.. భారీ ప్రచారాలు, ర్యాలీలు, ప్రసంగాలు ఉంటాయి. అయితే, వీటన్నింటినీ బంద్ చేసింది.
కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే తమ నామినేషన్ వేయాలి. ఇక, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కట్టే డిపాజిట్‌లను కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఎక్కడా ఎన్నికల కు భారీ ఎత్తున ప్రజలను సమీకరించరాదు. వంటి ఇప్పటి వరకు లేని ఎన్నికల నిబంధనలను తెరమీదికి తెచ్చింది. ఏదేమైనా.. మారుతున్న కాలంలో మార్పును తీసుకువచ్చిన కరోనా.. ఎన్నికలను కూడా సమూలంగా మార్చేసి.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు కొత్తపాఠాలు నేర్పుతోంది!